విషాదం.. అమరావతి నదిలో.. స్నానానికి వెళ్లి విద్యార్థులు మృతి

Six killed after bathing in Amravati river. తమిళనాడు రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిన్న తిరుపూర్ జిల్లాలోని ధరాపురంలోని అమరావతి నదిలో నీట మునిగి ఆరుగురు

By అంజి  Published on  18 Jan 2022 3:15 PM IST
విషాదం.. అమరావతి నదిలో.. స్నానానికి వెళ్లి విద్యార్థులు మృతి

తమిళనాడు రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిన్న తిరుపూర్ జిల్లాలోని ధరాపురంలోని అమరావతి నదిలో నీట మునిగి ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. అమరావతి నదికి వెళ్లిన ఎనిమిది మంది సభ్యుల బృందంలో ఆరుగురు యువకులు ఉన్నారు. మృతుల్లో ఐదుగురు పాఠశాల విద్యార్థులు కాగా, ఆరో వ్యక్తి కళాశాల విద్యార్థి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బృందం దిండిగల్ జిల్లాలోని మంపరైలోని ఓ ఆలయానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో దిగిన తర్వాత యువకులు బురదలో చిక్కుకున్నారు. ఎనిమిది మందిలో.. ఆరుగురు యువకులు నీటిలో మునిగి మరణించగా, మరో ఇద్దరిని స్థానికులు, అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ సిబ్బంది రక్షించారు.

మృతులను మోహన్, రంజిత్, శ్రీధర్, చక్రవర్మణి, అమీర్, యువన్‌లుగా గుర్తించారు. వారి మృతదేహాలను వెలికి తీసిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రక్షించిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ధరాపురం ఏరియాలో అమరావతి నదిలో స్నానానికి నిషేధం విధిస్తూ బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నాయి. అయినా యువకులు పట్టించుకోకుండా నదిలో స్నానానికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story