హైదరాబాద్‌లో సైబర్ మోసానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పెట్టుబడి పెట్టండి అధిక రాబడి ఇస్తామని హామీ ఇచ్చి ఒక మహిళను మోసం చేశారు. తార్నాక నివాసి అయిన 34 ఏళ్ల బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్‌ను సంప్రదించి, జనవరి- జూలై 2025 మధ్య సైబర్ మోసగాళ్లు తనను మోసం చేశారని ఫిర్యాదు చేసింది. నిందితులు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రతినిధులుగా నటిస్తూ ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా బాధితురాలిని సంప్రదించారు.
నిందితులను అడ్డులపురి హర్ష వర్ధన్, కొండూరు వేణు, మైలారం ప్రదీప్, పచ్చిపాల వినోద్ యాదవ్, పరసనబోయిన వంశీ, మంగలి లక్ష్మణ్‌గా గుర్తించారు. వారిపై పలు సెక్షన్స్ కింద అభియోగాలు మోపారు. నిందితులు బాధితురాలితో మాట్లాడి నమ్మకాన్ని పొందడానికి లాభాలు వస్తున్నట్లుగా నమ్మబలికారు. మోసగాళ్ళు నకిలీ వెబ్‌సైట్‌లను ఉపయోగించారు. బాధితురాలు ఆ మొత్తాన్ని బదిలీ చేసిన తర్వాత, మోసగాళ్ళు ఆమెను బ్లాక్ చేసి, అన్ని కమ్యూనికేషన్‌లను తెంచుకున్నారు.
ఆరుగురు నిందితులు సైబర్ మోసం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వీకరించడానికి బ్యాంకు ఖాతాలను తెరిచి లావాదేవీలు చేశారు. వారి నుంచి 15 డెబిట్ కార్డులు, మూడు పాస్‌బుక్‌లు, ఒక చెక్ బుక్, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఒక ఫింగర్ ప్రింట్ మెషిన్, ఒక స్కానర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.