కారు అదుపు తప్పి కంటైనర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో జరిగింది. మృతులను హైదరాబాద్‌లోని బేగంపేట వాసులుగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సైబర్ క్రైం విభాగంలో గిరిధర్(45) హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులు మొత్తం 10 మందితో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి జిల్లా గాన్గాపూర్లోని దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడానికి కారులో బయలుదేరారు. బీదర్ జిల్లాలోని బంగూరు వద్దకు రాగానే కారు అదుపు తప్పి వెనక నుంచి కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. మృతులను గిరిధర్(45), అనిత(30), ప్రియ(15), మహేష్(2), డ్రైవర్ జగదీష్(30)లుగా గుర్తించారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. బీదర్ తాలూకా మన్నల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.