పలనాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఆగి ఉన్న సిమెంట్ లారీని మినీ లారీ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. పలనాడు జిల్లా రెంటచింతల సమీపంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. రెంటచింతలలోని వడ్డెరబావి కాలనీకి చెందిన 38 మంది వ్యవసాయ కూలీలు, వారి బంధువులు మినీలారీలోని శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి 11.50 గంటల ప్రాంతంలో రెంటచింతల సబ్ స్టేషన్ కు చేరుకున్నారు.
అదే సమయంలో మాచర్ల నుంచి సిమెంట్ లోడుతో వస్తున్న లారీ సబ్ స్టేషన్ సమీపంలోని ఎర్రకాలువ వద్ద ఆగింది. భక్తులతో వెళ్తున్న మినీ లారీ ఆగి ఉన్న సిమెంట్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి పలువురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన సబ్‌స్టేషన్‌లోని వారు వచ్చి లారీలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతులను నారాయణపురం రోశమ్మ (70), మక్కెన రమణ (50), అన్నవరపు కోటమ్మ (70), కురిసేటి రమాదేవి (50), పెద్దారపు లక్ష్మీనారాయణ (32), పులిపాడు కోటేశ్వరమ్మ (60)లుగా గుర్తించారు. ప్రమాద స్థలాన్ని గురజాల డీఎస్పీ బెజవాడ మెహర్ జయరామ్ ప్రసాద్, ఎస్‌ఐ షేక్ షామీర్ బాషా పరిశీలించారు. మృతదేహాలను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.