శింగనమలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

అనంతపురం జిల్లా శింగనమలలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు

By Medi Samrat  Published on  26 Oct 2024 6:34 PM IST
శింగనమలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

అనంతపురం జిల్లా శింగనమలలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. శింగనమల నియోజకవర్గంలోని సింగనమల మండలం నాయనపల్లి క్రాస్ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులంతా అనంతపురం నగరం ఇస్కాన్ టెంపుల్ కు సంబంధించిన భక్తులుగా స్థానికులు, పోలీసులు గుర్తించారు. తాడిపత్రి పట్టణంలో ఓ వేడుకకు హాజరై తిరిగి అనంతపురానికి వస్తుండగా ప్రమాదంలో మృత్యువాత ప‌డ్డారు. నాయనపల్లి క్రాస్ సమీపానికి రాగానే కారు టైరు పగిలి లారీకి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న భక్తులందరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల‌ను సంతోష్, షణ్ముక్, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు ఇస్కాన్ టెంపుల్ భక్తులు దుర్మరణం చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Next Story