జగిత్యాల జిల్లా పోలీసులు మారుమూల గ్రామానికి చెందిన 27 సంవత్సరాల కిరాణా దుకాణం యజమానిని అదుపులోకి తీసుకున్నారు. తన దుకాణానికి వస్తున్న మైనర్ బాలికలను వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల్లో ముగ్గురు 12 ఏళ్ల లోపు వారు కాగా, మరొకరికి 13 ఏళ్లు ఉన్నాయి. నిందితుడు తన దుకాణానికి వచ్చే మైనర్ బాలికలతో మంచిగా మాట్లాడుతూ స్నేహం చేస్తూ ఉన్నాడు. "నిందితుడు బాలికలకు చాక్లెట్లు అందజేస్తూ అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తూ వచ్చాడని విచారణలో తేలింది" అని కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న పోలీసు అధికారి గురువారం తెలిపారు.
షాపు యజమాని తన స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని కొన్ని సార్లు మైనర్‌లకు ఇచ్చి వారిని ఆకర్షించేవాడని అధికారి తెలిపారు. తమ కుమార్తెలలో కొందరికి ఆరోగ్యం సరిగా లేకపోవడాన్ని గమనించిన బాలికల తల్లిదండ్రులకు అతడిపై అనుమానం పెరిగింది. విచారించగా.. కిరాణా దుకాణం యజమాని షాప్‌లోకి రప్పించి వేధించాడని బాలిక తల్లిదండ్రులకు వెల్లడించింది. విచారణలో నిందితుడు గత ఏడాది కాలంగా తన దుకాణానికి వచ్చే మైనర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు అంగీకరించాడు. అతను వారి బట్టలు విప్పి లైంగికంగా వేధించాడు అని పోలీసు అధికారులు చెప్పారు. షాపు యజమానిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.