భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో మరో ట్విస్ట్, నిందితుడికి సహకరించిన మరో ముగ్గురు?
వెంకటమాధవిని నిందితుడైన భర్త గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
By Knakam Karthik Published on 9 Feb 2025 2:45 PM IST
భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో మరో ట్విస్ట్, నిందితుడికి సహకరించిన మరో ముగ్గురు?
హైదరాబాద్ మీర్ పేట్‌లో కలకలం రేపిన వెంకటమాధవి హత్య కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటమాధవిని నిందితుడైన భర్త గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక మహిళ పాటు మరో ఇద్దరి పాత్ర ఉండే అవకాశం ఉందని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు గురుమూర్తిని కోర్టు ఐదు రోజుల కస్టడీ కోసం పోలీసులకు అనుమతి ఇచ్చింది. వెంకట మాధవి హత్యకు గురుమూర్తికి సహకరించిన వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా ఇప్పటికే గురుమూర్తి కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నించారు. అవసరమైతే గురుమూర్తికి పాలీగ్రాఫ్ టెస్టులు కూడా నిర్వహించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పరిధిలో దారుణం జరిగిన తెలిసిందే. గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడికించాడు. తర్వాత వాటిని తీసుకువెళ్లి సమీపంలోని డ్రైనేజీలో పడేశాడు. బొక్కలను కాల్చి పొడి చేసి చెరువులో కలిపాడు. జనవరి16, 2025న ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్ల నుంచి గురుమూర్తి తన భార్య వెంకటమాధవిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఈ నెల16వ తేదీన భార్యతో గొడవపడిన గురుమూర్తి.. తర్వాత తన భార్య కనిపించడం లేదని అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. తనతో గొడవ పడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఒక్కడే వెళ్లి మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి ఎదురుగా, పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
అయితే వెంకట మాధవి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు ఎక్కడా ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. పలుమార్లు గురుమూర్తి కొన్ని కవర్లతో బయటకు వెళ్లి రావడాన్ని గుర్తించారు. దీంతో అతడిలోని అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత వెంకట మాధవి అత్తతో ఫిర్యాదు తీసుకుని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గురుమూర్తిని ప్రశ్నించారు. ఇక కేసు నుంచి బయటపడలేనని అనుకున్న గురుమూర్తి.. తానే భార్య వెంకట మాధవిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.