రికవరీ ఏజెంట్లు హద్దు మీరి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రికవరీ ఏజెంట్ల వేధింపులకు బలైన విద్యార్థిని హరితవర్షిణి కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు మేనేజర్లు కాగా.. నలుగురు రికవరీ ఏజెంట్లు. వీరందరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు క్రెడిట్ కార్డుల ద్వారా హర్షిణి తండ్రి ఆరు లక్షల రూపాయలు వాడుకున్నట్లు పోలీసులు వివరించారు. వాటిని సేకరించేందుకు నిర్వాహకులు ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో తండ్రి ఇంట్లో లేకపోవడంతో రికవరీ ఏజెంట్లు కుటుంబ సభ్యులపైనా, కూతురు హరిత వర్షిణిపైనా గోరంగా అవమానించడంతో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ కేసు విషయమై డిసిపి మేరీ ప్రశాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు. కేసులో నలుగురు రికవరీ ఏజెంట్లు, ముగ్గురు మేనేజర్లను అరెస్ట్ చేసినట్లు డీసిపి మేరీ ప్రశాంతి వెల్లడించారు. హరిత కుటుంబ సభ్యులకు భంగం కలిగించే విధంగా.. ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా రికవరీ ఏజెంట్లు వ్వవహరించారని ఆమె పేర్కొన్నారు.