ఏటీఎంలో డబ్బు లోడ్ చేసే సెక్యూరిటీ సిబ్బంది.. దాదాపు రూ.1.40 కోట్లను కొల్లగొట్టారు. తాజాగా బ్యాంకు అధికారుల ఆడిటింగ్‌లో నగదు వ్యవహారం తెరమీదికి రావడంతో.. సిబ్బంది చేతివాటంపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు ఆలేరులోని ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా బ్యాంకులకు చెందిన మొత్తం 18 ఏటీఎం సెంటర్లలో నగదును జమ చేసే రైటర్స్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, రైటర్స్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఉద్యోగులు.. పాసికంటి వెంకటేశ్, గుర్రం ఉపేందర్, చైతన్యకుమార్ గుమ్మడవెల్లి, గట్టు రాజు కలిసి రూ.1,39,67,900ను 17 రోజుల వ్యవధిలో దఫదఫాలుగా కొట్టేశారు.
గత నెల 16 తేదీ వరకు ఏటీఎం మెషిన్లలో నగదు జమ సక్రమంగానే జరిగిందని.. ఫిబ్రవరి 2న ఆడిట్‌లో నగదు జమలో తేడాలు వచ్చాయని బ్యాంకు ఆడిట్ సెక్షన్ గుర్తించింది. నిందితులు రోజూ ఓ ఏటీఎంలో నగదు జమచేసే సమయంలో స్వాహా చేశారని జనగామ అర్బన్ పోలీసులు తెలిపారు.