అధిక లాభాల పేరుతో స్కామ్..రూ.850 కోట్లు కొల్లగొట్టిన చీటర్స్ అరెస్ట్
మాదాపూర్‌లో ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik
అధిక లాభాల పేరుతో స్కామ్..రూ.850 కోట్లు కొల్లగొట్టిన చీటర్స్ అరెస్ట్
హైదరాబాద్: మాదాపూర్‌లో ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 850 కోట్ల రూపాయలను అమాయకమైన జనాల నుండి వసూలు చేసుకుని పరార్ అయ్యారు. లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్ లోని ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్ తమ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబ డుల పేరు అధిక లాభాలు ఇస్తా మంటూ అమాయ కమైన జనాలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేశారు. ఇలా పలు రాష్ట్రాల్లో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతూ కోట్లలో గడించారు. అలా అమాయక జనాలు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా నకిలీ అకౌంట్లోకి మళ్లించారు. ఏవి సొల్యూషన్ డైరెక్టర్ గడ్డం వేణుగోపాల్ మరియు ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ ఎండి శ్రియస్ పాల్... ఇద్దరు కలిసి తమ ద్వారా కంపెనీలలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ జనాలను మోసం చేశారు. ఇలా 3200 మంది బాధితుల దగ్గర నుండి 850 కోట్ల రూపాయలు వసూలు చేశారు.
ఏవి టెక్నాలజీకి అనుబంధంగా ఒక పది షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఏవి సొల్యూషన్స్ శ్రీనివాస్ అనల్టిక్, ట్రేడ్ బుల్ టెక్నాలజీ, ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీ రకరకాల కంపెనీల పేర్లతో జనాలకు గాలం వేసి వారిని నమ్మించి వారి నుంచి లక్షల్లో పెట్టుబడి వసూలు చేశారు. ఇలా 3200 మంది బాధితుల దగ్గర నుండి 850 కోట్ల రూపాయలు వసూలు చేసి... అనంతరం బోర్డు తిప్పేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ ఎండి శ్రియస్ పాల్, ఏవి సొల్యూషన్ డైరెక్టర్ గడ్డం వేణుగోపాల్‌ను అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నకిలీ 10 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా నిధులు మొత్తాన్ని విదేశా లకు తరలించినట్లు గా పోలీసులు గుర్తించారు.