ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా సోమవరప్పాడులో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది. అయితే ఏలూరు జిల్లా సోమవరప్పాడు వద్దకు చేరుకోగానే అతివేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న సిమెంట్ లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానికుల సమాచారంతో ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఈ మేరకు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.