పెళ్లికి వెళ్తున్న కారుకు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరఖాండ్ రాష్ట్రం చమోలీలోని గౌచర్‌లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫరీదాబాద్ నుంచి వెళ్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురైంది.
By Medi Samrat
ఉత్తరఖాండ్ రాష్ట్రం చమోలీలోని గౌచర్‌లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫరీదాబాద్ నుంచి వెళ్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురైంది. వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్నారు. అందులో ఐదుగురు చనిపోయారు. క్రేన్‌తో వాహనాన్ని నదిలో నుంచి బయటకు తీశారు. ఇందులో ఐదు మృతదేహాలను వెలికితీశారు. ఒక మహిళ ప్రాణాలతో బయటపడింది. అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
కుటుంబం గతంలో చమోలి జిల్లా వాసులు. ప్రస్తుతం ఫరీదాబాద్ (హర్యానా)లో నివసిస్తున్నారు. బంధువు మెహందీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. అందరూ థార్‌లో వేడుకకు బయలుఏవారు. దేవప్రయాగ్ నుండి శ్రీనగర్ వైపు 15 కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ హైవేపై బగ్వాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
దాదాపు 250 మీటర్ల లోతులో ఉన్న గుంటలో థార్ కారు అలకనంద నదిలో పడింది. కారులో ఉన్న మహిళను రక్షించారు. ఆమెను శ్రీనగర్ బేస్ ఆస్పత్రిలో చేర్పించారు. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
కారులో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరిలో మహిళ అనితా నేగిని రక్షించగా.. మహిళ కుమారుడు ఆదిత్య, మహిళ చెల్లెలు మీనా గుసాయి, ఆమె భర్త సునీల్ గుసాయి సహా ఇద్దరు పిల్లలు మరణించారు.
సమాచారం ప్రకారం, మహిళ అనితా నేగి నివాసం రూర్కీ నుండి థార్ కారు తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరింది. అనితా నేగీకి ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆమె భర్త ఆర్మీ మేన్. అనిత తన పెద్ద కుమారుడితో కలిసి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తన సోదరి కుటుంబంతో కలిసి బయలుదేరింది. ఆమె చిన్న కూతురు రూర్కీలో ఉంది. మీనా నేగి.. ఆమె కుటుంబం ఫరీదాబాద్‌లో నివసిస్తున్నారు. మీనా భర్త సునీల్ గుసాయి కారు నడుపుతున్నాడు. ఈ ఇద్దరు సోదరీమణులు తమ అత్త కొడుకు (మేనల్లుడు) పెళ్లికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మహిళ షాక్‌తో ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది. కొందరు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.