ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కొందరి చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కారు, లారీ ఢీ..
వరంగల్ జిల్లాలోని కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామశివారులో కారు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను కమలాపూర్ మండలం గుంటూరుపల్లికి చెందిన చుక్కా అజయ్(24), అన్నెం నాగార్జున రెడ్డి(32)లుగా గుర్తించారు.
ఖమ్మం జిల్లాలో యువతి మృతి
కరీంనగర్ నుంచి భద్రాచలం వెలుతున్న కారును ఖమ్మం గ్రామీణ మండలం కల్లంపాడు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నందిత(16) మరణించింది. కారు డ్రైవర్‌తో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.