తెలుగు రాష్ట్రాలలో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు- కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాచారెడ్డి మండలంలో సోమవారం ఉదయాన ఈ ప్రమాదం జరిగింది. ఘన్పూర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ నుంచి కామారెడ్డి వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. బస్సు కరీంనగర్ వన్ డిపోకు చెందినదిగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారు నంబర్ – TS 16 FB 4366 అని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడ్డ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతోనే అదుపుతప్పి కారును ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కరీంనగర్ డిపో-1 బస్సు సిరిసిల్ల నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.