లోయలో ప‌డ్డ బ‌స్సు.. నలుగురు మృతి

Road Accident in Araku. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏజెన్సీ ప్రాంత‌మైన‌ అరకులోయలో

By Medi Samrat  Published on  12 Feb 2021 9:06 PM IST
లోయలో ప‌డ్డ బ‌స్సు.. నలుగురు మృతి

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏజెన్సీ ప్రాంత‌మైన‌ అరకులోయలో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్ట్ బస్సు ఘాట్‌రోడ్‌లో డుముకు ప్రాంతం దాటిన తర్వాత..‌ ఐదో నంబరు మలుపు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు. పలువురి టూరిస్టులకు గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి సీరియ‌స్‌గా ఉంది. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు.

ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక‌ చర్యలు చేపట్టారు. బస్సు దూసుకెళ్లిన ప్రాంతంలో చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఎస్‌. కోట ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అరకు బస్సు ప్రమాదంలో అసలేం జరిగింది…?

విహార యాత్రలో విషాదం నెలకొనడానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబం, ఇతర బంధువుల ఈ నెల 10వ తేదీన ఉత్సాహంగా దినేష్ ట్రావెల్స్‌ బస్సులో ఆధ్యాత్మిక, విహార యాత్రకు బయలుదేరారు. విజయవాడ ఇంద్రకీలాద్రి, మంగళగిరి పానకాలస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.

అక్కడి నుంచి గురువారం రాత్రికి సింహాచలం చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేసిన వారంతా…శుక్రవారం ఉదయం అరకు వెళ్లారు. బొర్రా గుహలతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలు సందర్శించారు. ఆధ్మాత్మిక, పర్యాటక యాత్రలో చివరి కార్యక్రమంగా సింహాచలం అప్పన్నను దర్శించుకుని ఇంటికి తిరిగి వెళ్దామనుకున్నారు. లగేజ్ మొత్తం సింహాచలంలోనే ఉండడంతో.. అరకు నుంచి సింహాచలానికి తిరుగు ప్రయాణమయ్యారు.

అప్పటికే చీకటి పడింది. బస్సు బయలుదేరింది…కొంచెం దూరం రాగానే బస్సు బ్రేకులు ఫెయిలయినట్టు గుర్తించిన డ్రైవర్ ప్రయాణికులకు విషయం చెప్పాడు. అత్యంత ప్రమాదకర మలుపు ఉండడంతో.. బస్సు అదుపుతప్పి.. 300 అడుగుల లోతులో పడిపోయింది. ఘాట్‌రోడ్డులో డ్రైవింగ్ చేయ‌గ‌ల‌ నైపుణ్యం లేని డ్రైవర్ రాత్రి వేళ బస్సు నడపడం ప్రమాద తీవ్రతను పెంచింది. ప్రమాదంలో ఎనిమిది నెలలు చిన్నారి నిత్య సహా నలుగురు మరణించారు. మృతులను సత్యనారాయణ, సరిత, లతగా గుర్తించారు.

బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై సీఎంఓ అధికారులను ఆరా తీశారు. జరుగుతున్న సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశింశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

ప్రమాదం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ క‌డా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Next Story