వివాహ‌మైన తొమ్మిది రోజుల‌కే విషాదం

Road Accident at Pantangi toll plaza one dead.వివాహ‌మైన 20 ఏళ్ల‌కు క‌లిగిన సంతానం కావ‌డంతో ఎంతో అల్లారుముద్దుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2022 11:14 AM IST
వివాహ‌మైన తొమ్మిది రోజుల‌కే విషాదం

వివాహ‌మైన 20 ఏళ్ల‌కు క‌లిగిన సంతానం కావ‌డంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఇటీవ‌ల అత‌డికి పెళ్లి చేశారు. త‌మ చివ‌రి రోజుల్లో ఆస‌రాగా ఉంటాడ‌ని బావిస్తుండ‌గా.. అనుకోకుండా జ‌రిగిన ప్ర‌మాదంతో కొడుకు మృతి చెంద‌గా, కోడ‌లు తీవ్ర‌గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. పెళ్లైన తొమ్మిది రోజులకే కుమారుడు ప్రాణాలు కోల్పోవ‌డంతో వృద్ధాప్యంలోని ఆ తల్లిదండ్రుల రోద‌న వ‌ర్ణ‌నాతీతంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండల కేంద్రానికి చెందిన ములకలపల్లి రాములు-మైసమ్మ దంపతులకు వివామైన 20 ఏళ్ల త‌రువాత వీర‌భ‌ద్రం(25) జ‌న్మించాడు. దీంతో అత‌డిని త‌మ‌కు ఉన్న‌దాంట్లో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. దగ్గర బంధువు అయిన పెన్‌ప‌హాడ్ మండ‌లం అనాజిపురానికి చెందిన సైదులు-విజయ దంపతుల పెద్ద కుమార్తె ప్రణీత(20)తో వీరభద్రంకు ఈ నెల 21న‌ వివాహం జ‌రిపించారు.

వీర భ‌ద్రం హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ప‌ని చేస్తున్నాడు. వివాహం కోసం పెళ్లికి వారం ముందే సెల‌వు పెట్టారు. వివాహం జ‌రిగి వారం రోజులు కావ‌డం, సెల‌వులు ముగియ‌డంతో విధుల్లో చేరేందుకు భార్య‌తో క‌లిసి సోమ‌వారం మ‌ధ్యాహ్నాం ఆత్మ‌కూర్‌(ఎస్) నుంచి బైక్‌పై హైద‌రాబాద్ బ‌య‌లుదేరాడు. అయితే.. చౌటుప్ప‌ల్ మండ‌లం పంతంగి టోల్‌ప్లాజా స‌మీపంలోకి రాగానే ద్విచ‌క్ర‌వాహ‌నం రోడ్డుపై నుంచి అదుపు త‌ప్పి ప‌క్క‌నే ఉన్న టోల్‌గేట్ బోర్డును ఢీ కొట్టింది.

తీవ్రంగా గాయ‌ప‌డిన వారిద్ద‌రిని చికిత్స నిమిత్తం హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా వీర‌భ‌ద్రం అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. ప్రణీత తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వీర‌భ‌ద్రం మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్ప‌ల్ ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.

Next Story