రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ఓ వివాహిత తన మూడేళ్ల కుమార్తెను చంపి, కదులుతున్న రైలు నుంచి మృతదేహాన్ని విసిరివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి ఆ మహిళ తన కుమార్తెను గొంతు నులిమి హత్య చేసింది. ఆపై ప్రియుడి సహాయంతో ఆమె మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టివేసింది. ఆ తర్వాత ఇద్దరూ శ్రీగంగానగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు ఎక్కి మృతదేహాన్ని కదులుతున్న రైలులో నుండి కిందకు పడేశారు.
ఈ హత్యకు తెగబడ్డ మహిళను సునీతగా గుర్తించారు. తన కుమార్తెను హత్య చేసినట్లు సునీత అంగీకరించడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. "మహిళ తన కుమార్తెను గొంతు నులిమి, ప్రియుడు సహాయంతో ఆమె మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, శ్రీగంగానగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది" అని పోలీసు సూపరింటెండెంట్ (శ్రీగంగానగర్) ఆనంద్ శర్మ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. "ఉదయం 6:10 గంటలకు రైలు ఎక్కారు. ఫతుహి రైల్వే స్టేషన్ కు ముందు వచ్చే కాలువపై ఉన్న వంతెన దగ్గర.. కదులుతున్న రైలు నుండి మృతదేహాన్ని పడవేశారు" అని పోలీసులు తెలిపారు.
వీరిద్దరూ మృతదేహాన్ని కాలువలో పడేయాలని భావించారు, అయితే అది రైలు పట్టాల సమీపంలో పడిపోయింది. గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు. ఐదుగురు పిల్లలు ఉన్న సునీత, తన ప్రియుడు సన్నీ ఆమె ఇద్దరు కుమార్తెలతో శాస్త్రి నగర్‌లో నివసిస్తూ ఉంది. ముగ్గురు పిల్లలు ఆమె భర్తతో ఉంటున్నారు.