భార్య చ‌నిపోతే 1.9 కోట్లు ఇన్సూరెన్స్ డ‌బ్బు వ‌స్తుంద‌ని

Rajasthan Man Kills Wife To Get Rs 1.90 Crore Insurance Amount.ఓ వ్య‌క్తి ఇన్సూరెన్స్ డ‌బ్బు కోసం భార్య‌నే చంపేశాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2022 9:42 AM IST
భార్య చ‌నిపోతే 1.9 కోట్లు ఇన్సూరెన్స్ డ‌బ్బు వ‌స్తుంద‌ని

ఇటీవ‌ల కాలంలో మాన‌వ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. డ‌బ్బు కోసం ఎంత‌కైనా తెగిస్తున్నారు. అన్న, త‌మ్ముడు, భ‌ర్త‌, భార్యా, కొడుకు, తండ్రి అన్న తేడా లేకుండా డ‌బ్బు కోసం ఎవ‌రినైనా హ‌త మార్చేందుకు వెన‌కాడ‌డం లేదు. ఓ వ్య‌క్తి ఇన్సూరెన్స్ డ‌బ్బు కోసం భార్య‌నే చంపేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ట్రంలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. జైపూర్‌కి చెందిన షాలూ, మహేశ్‌ చంద్ ల‌కు 2015లో వివాహం జ‌రిగింది. వీరికి ఓ కుమార్తె సంతానం. కొద్ది రోజుల క్రితం దంప‌తుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. భ‌ర్త‌పై గృహ‌హింస కేసు పెట్టిన షాలూ పుట్టింటికి వెళ్లి ఉంటోంది. మ‌హేశ్ చంద్ ఇటీవ‌ల భార్య‌ను క‌లిసి ఓ విష‌యం చెప్పాడు. తాను ఓ జ్యోతిష్యుడిని క‌లిశాన‌ని, మ‌న మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు రాకుండా ఉండాలంటే 11 రోజుల పాటు తెల్ల‌వారుజామునే హ‌నుమాన్ ఆల‌యానికి వెళ్లి పూజ‌లు చేయాల‌ని జ్యోతిష్యుడు చెప్పిన‌ట్లు ఆమెను న‌మ్మించాడు. పూజ‌లు పూర్తి అయిన త‌రువాత త‌న‌ను ఇంటికి తీసుకువెలుతాన‌ని, ఈ విష‌యాన్ని ఎవ‌రో చెప్ప‌కూడ‌ద‌ని కూడా చెప్పాడు.

భ‌ర్త మాట‌లు న‌మ్మిన షాలూ త‌న సోద‌రుడితో క‌లిసి ఉద‌యం 4.30గంట‌ల‌కే ఆల‌యానికి వెలుతూ ఉండేది. రోజులాగానే ఆల‌యానికి సోద‌రుడితో క‌లిసి వెలుతున్న షాలూ బండిని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో షాలూ అక్కడిక‌క్క‌డే చ‌నిపోయింది. ఆమె సోద‌రుడు చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు.

ఈ ప్ర‌మాదంపై కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు భ‌ర్త మ‌హేష్ చంద్‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ చేయ‌గా అస‌లు నిజాన్ని తెలిపాడు. ఇన్స్యూరెన్స్ డ‌బ్బు కోస‌మే భార్య‌ను హ‌త్య చేయించిన‌ట్లు వెల్ల‌డించాడు. హ‌త్య‌కు కొద్ది రోజుల‌కు క్రిత‌మే భార్య షాలూ పేరుతో 40 ఏళ్ల‌కు గాను భీమా చేయించాడు. స‌హ‌జ‌మ‌ర‌ణం పొందితే రూ.1కోటి, ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే రూ.1.9 కోట్లు వ‌చ్చేలా ఇన్సూరెన్స్ చేయించాడు. భార్య‌ను హ‌త్య చేసేందుకు ఓ రౌడీ షీట‌ర్‌తో రూ.10లక్ష‌ల‌కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.5.5ల‌క్ష‌లు ఇచ్చాడు.

ఈ కేసులో రౌడీ షీట‌ర్ రాథోడ్‌తో పాటు కారు య‌జ‌మానులు రాకేష్ సింగ్‌, సోనూల‌ను అరెస్ట్ చేశారు. మ‌రో ఇద్ద‌రు నిందితులు ప‌రారీలో ఉన్నారు.

Next Story