హనీ ట్రాప్.. ఒకప్పుడు డైరెక్ట్ గా ఆడవారిని అడ్డం పెట్టుకుని ఎన్నో విషయాలను రాబట్టేవారు. ఇప్పుడు ఫోన్లో వీడియో కాల్స్, మెసేజీలతో కావాల్సిన సమాచారం రాబడుతూ ఉన్నారు. అలా ఓ పాక్ మహిళ ఉచ్చులోకి భారత్ కు చెందిన మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసు ఉద్యోగి పడిపోయాడు. అతడు తన గురించే కాకుండా.. ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ఆ మహిళకు చేరవేశాడు. దీంతో అధికారులు ఇప్పుడు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నగరంలోని మిలటరీ చీఫ్ ఇంజినీరు కార్యాలయంలో గజేంద్రసింగ్ (35) నాల్గవతరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
గజేంద్రసింగ్ కు ఓ మహిళ దగ్గర నుండి మెసేజీలు రావడం మొదలైంది. ఆమె పాకిస్తాన్ కు చెందిన మహిళ. పరిచయం పెంచుకొని ఆమెతో తరచూ వాట్సాప్ చాటింగ్ చేస్తుండేవాడు. జైపూర్ పోలీసులు గజేంద్రసింగ్ పై నిఘా వేయగా మిలటరీ ఇంజినీరింగ్ కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లు, లేఖలను వాట్సాప్ లో పాక్ మహిళకు పంపించాడని దర్యాప్తులో తేలింది. జోధ్ పూర్ నగరంలో ఉన్న గజేంద్రసింగ్ ను పోలీసులు, నిఘా సంస్థలు అదుపులోకి తీసుకున్నారు. గజేంద్రసింగ్ మొబైల్ ఫోన్ వాట్సాప్ చాటింగ్ ను పరిశీలించగా పాక్ మహిళతో అసభ్యకరంగా చాట్ చేశాడని, దీంతోపాటు పలు ఆర్మీ కీలక పత్రాలను పాక్ మహిళకు పంపించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ ఉన్నట్లు భావిస్తూ ఉన్నారు.