హైద్రాబాద్ : రాచకొండ కమిషనరేట్‌లో మాయలు మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాకేష్ అనే మాయగాడు ఇంట్లో నెలకొన్న సమస్యలు తిరుస్తానంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నాడు. తనకు దైవ శక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ లక్షలు దండుకుంటున్నాడు కేటుగాడు. అనారోగ్య సమస్య కారణంగా లోయర్ ట్యాంక్ బండ్ కు చెందిన మహిళ రాకేష్ ను కలిసింది. నీ పేరుపై అమ్మవారికి పూజ చేస్తానని చెప్పి సదరు మహిళ వద్ద రూ.1,60,000 నగదు, 5 తులాల బంగారం తీసుకున్నాడు రాకేష్.
మహిళ పూజల గురించి అడిగినప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు రాకేష్. తీసుకున్నబంగారం, నగదు తిరిగి ఇవ్వమని మహిళ పలుమార్లు రాకేష్‌ను వేడుకుంది. ఈ నెల 10న డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్న మహిళను అసభ్య పదజాలంతో దూషించిన రాకేష్ బయటకు పంపాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ 406, 420, 506, 509, 342 సెక్షన్‌ల కింద కేసులు నమోదుచేశారు. ఈ మాయగాడు ఒక్క మహిళ నే కాకుండా మరో ఐదుగురిని ఇలానే మోసం చేసినట్లు.. ఈ మేరకు నెరేడ్ మెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయినట్లు పోలీసులు తెలిపారు.