బస్సు మరో ప్లాట్ ఫామ్‌పై ఉందని తీసుకెళ్లి, పుణె ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం
మహారాష్ట్రలోని పుణెలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 5:17 PM IST
బస్సు మరో ప్లాట్ ఫామ్‌పై ఉందని తీసుకెళ్లి, పుణె ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం
మహారాష్ట్రలోని పుణెలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు చెందిన అతిపెద్ద బస్ జంక్షన్లలో ఒకటైన స్వర్గేట్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలో రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో 26 ఏళ్ల మహిళపై దొంగతనం కేసుల చరిత్ర కలిగిన ఓ నేరస్థుడు నిలిపి ఉంచిన బస్సులో అత్యాచారానికి పాల్పడినట్లు స్వర్గేట్ పోలీసులు తెలిపారు. దత్తా గాడే"గా గుర్తించిన నిందితుడిపై దొంగతనం, చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు.
బాధిత మహిళ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఒక ప్లాట్ ఫామ్‌లో పైథాన్‌కు వెళ్లే బస్సు కోసం ఆమె వేచి ఉన్నట్లు తెలిపింది. ఇంతలో ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి బస్సు మరొక ప్లాట్ ఫామ్ మీదకు వచ్చిందని చెప్పాడని తెలిపింది. ఆ తర్వాత నిందితుడు తనను బస్ స్టేషన్ ఆవరణలోని నిర్మానుష్య ప్రదేశంలో నిలిపి ఉంచిన ఖాళీ బస్సు వద్దకు తీసుకెళ్లాడని చెప్పింది. అనంతరం బస్సు ఎక్కిన తర్వాత తనను వెంబడించి అత్యాచారం చేసి పారిపోయాడని ఆ మహిళ పోలీసులకు చెప్పింది. కాగా సీసీఫుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.