పార్కింగ్ స్థలంలో ఆమెను చంపేస్తున్నా ఎవరూ అడ్డుకోలేదు

పూణెలోని ఓ కంపెనీ పార్కింగ్ స్థలంలో 28 ఏళ్ల మహిళపై పదునైన కత్తితో సహోద్యోగి దాడి చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.

By Medi Samrat  Published on  9 Jan 2025 7:51 PM IST
పార్కింగ్ స్థలంలో ఆమెను చంపేస్తున్నా ఎవరూ అడ్డుకోలేదు

పూణెలోని ఓ కంపెనీ పార్కింగ్ స్థలంలో 28 ఏళ్ల మహిళపై పదునైన కత్తితో సహోద్యోగి దాడి చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ భయంకరమైన దాడిని చాలా మంది చూశారు, కానీ ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఆ మహిళ గాయాలతో చివరికి మృతి చెందింది.

ఎరవాడలోని డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ - బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (బిపిఓ) కంపెనీలో అకౌంటెంట్ కృష్ణ కనోజా (30) నుండి అతడి సహోద్యోగి 28 ఏళ్ల శుభదా కోడరే చాలాసార్లు డబ్బు అప్పుగా తీసుకుంది. తన తండ్రి ఆరోగ్యం బాగోలేదంటూ శుభదా డబ్బులు తీసుకుంటూనే ఉంది. కృష్ణ కనోజా తనకు కూడా డబ్బు అవసరం ఉంది తిరిగి ఇవ్వాలని కోరుతున్నా కూడా ఆమె అతడి మాటలు పట్టించుకోలేదు. ఆమె చెప్పింది నిజమో కాదో తెలుసుకోడానికి కృష్ణ కనోజా ఆమె స్వస్థలానికి వెళ్ళాడు. ఆమె తండ్రి బాగానే ఉన్నాడని, ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడటం లేదని కనుగొన్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో, కృష్ణ కనోజా ఆఫీసు పార్కింగ్‌ దగ్గరకు రావాలని శుభదాను పిలిచాడు. తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో వాగ్వాదానికి దారితీసింది. దీంతో కృష్ణ ఆమెపై కత్తితో దాడి చేసి నరికి చంపాడు.

పార్కింగ్‌ ప్లేస్ లో ఉన్న చాలా మంది వ్యక్తులు శుభదాపై కృష్ణ కనోజా దాడి చేయడం చూశారు కానీ అతన్ని ఆపడానికి మాత్రం ప్రయత్నించలేదు. కృష్ణ ఆయుధాన్ని విసిరేసిన తర్వాత, ఓ గుంపు అతనిని చుట్టుముట్టి, అతనిని కొట్టింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో శుభదా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసి కృష్ణను అరెస్టు చేశామని పోలీసు అధికారి తెలిపారు.

Next Story