పూణేలోని స్వర్‌గేట్ బస్ స్టేషన్‌లో రాష్ట్ర రవాణా బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేయడానికి కావాల్సిన సమాచారం ఇచ్చిన వారికి పూణే పోలీసులు గురువారం రూ. 1 లక్ష రివార్డును ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడు దత్తాత్రే రాందాస్ (37) కోసం 13 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయని మహారాష్ట్ర పోలీసు అధికారి తెలిపారు. అతని ఆచూకీ గురించి సమాచారం అందించే వారికి రూ. 1 లక్ష రివార్డ్ ఇస్తామని పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ పిటిఐకి తెలిపారు.
మహారాష్ట్రలోని పుణెలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు చెందిన అతిపెద్ద బస్ జంక్షన్లలో ఒకటైన స్వర్గేట్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలో రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో 26 ఏళ్ల మహిళపై దొంగతనం కేసుల చరిత్ర కలిగిన దత్తాత్రే రాందాస్ నిలిపి ఉంచిన బస్సులో అత్యాచారానికి పాల్పడినట్లు స్వర్గేట్ పోలీసులు తెలిపారు. నిందితుడిపై దొంగతనం, చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు.