నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన డంప‌ర్‌.. ఇద్దరు పిల్ల‌లు సహా ముగ్గురు మృతి, ఆరుగురి ప‌రిస్థితి విష‌మం

మహారాష్ట్రలోని పూణె నగరంలోని వాఘోలీ చౌక్ ప్రాంతంలో ఓ బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on  23 Dec 2024 6:09 AM GMT
నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన డంప‌ర్‌.. ఇద్దరు పిల్ల‌లు సహా ముగ్గురు మృతి, ఆరుగురి ప‌రిస్థితి విష‌మం

మహారాష్ట్రలోని పూణె నగరంలోని వాఘోలీ చౌక్ ప్రాంతంలో ఓ బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలతో సహా ముగ్గురు వ్యక్తులపై నుంచి డంపర్ వెళ్ల‌డంతో వారు మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన నిన్న రాత్రి (ఆదివారం) అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో జరిగింది.

కస్నాంద్ ఫాటా సమీపంలోని వాఘోలి వద్ద అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని, పూణెకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన డంపర్ ఫుట్‌పాత్‌పైకి వచ్చి అక్కడ మురికివాడల్లో నిద్రిస్తున్న కూలీలందరినీ ఢీకొట్టింద‌ని పోలీసులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. డంపర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని.. పూణే నుండి వాఘోలీకి వెళుతుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.

జోన్ 4 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిమ్మత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. తదుపరి విచారణ కోసం మోటారు వాహనాల చట్టం, BNS సంబంధిత సెక్షన్ల కింద అతన్ని అరెస్టు చేశామ‌ని తెలిపారు.

గాయపడిన మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్ష‌త‌గాత్రుల‌ను ససూన్ ఆసుపత్రిలో చేర్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతి నుంచి దాదాపు డజను మంది కూలీలు ఆదివారం ఈ ప్రాంతంలోని వివిధ నిర్మాణ స్థలాల్లో పని చేసేందుకు రాగా.. వారు మృత్యువాత ప‌డ్డారు.

బాధితులకు సహాయం చేయడానికి వచ్చిన స్థానిక ప్రజల ప్రకారం.. ప్రమాద స్థలంలో భయంకరమైన దృశ్యాల‌తో, గాయపడిన బాధితులు, ప్రాణాలు కోల్పోయిన‌ వారి మృతదేహాలు, రక్తంతో అంతా చెల్లాచెదురుగా ఉందని.. కార్మికుల వస్తువులు, బట్టలు, పాత్రలు చెల్లాచెదురుగా పడి ఓ యుద్ధ ప్రాంతంలా అనిపించిందని వెల్ల‌డించారు. ప్ర‌మాదం అనంతరం పోలీసులు డంపర్‌ను తొలగించేందుకు ఏర్పాట్లు చేసి సంబంధిత లాంఛనాలు పూర్తి చేసి ఫుట్‌పాత్‌ను క్లియర్ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

Next Story