వికారాబాద్ జిల్లాలో చిక్కిన సైకో కిల్లర్
వికారాబాద్ జిల్లాలోని తాండూరులో కనిపించకుండా పోయిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.
By Medi Samrat Published on 8 Dec 2023 3:45 PM GMTవికారాబాద్ జిల్లాలోని తాండూరులో కనిపించకుండా పోయిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ హత్య వెనుక ఉన్నది ఓ సైకో కిల్లర్ అని తేలింది. అంతేకాకుండా అతడు ఈ ఒక్క మహిళను మాత్రమే కాకుండా మరెంతో మందిని హత్య చేశాడని కూడా తేలింది. వికారాబాద్ జిల్లాలో ఆరుగురు మహిళలు ఈ విధంగానే అదృశ్యమై చనిపోతూ ఉన్నారని తేలింది. ఓ సైకో కిల్లర్ ఈ హత్యలు చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానించారు. అయితే పోలీసుల అనుమానం నిజమైంది. ఓ సైకో కిల్లర్ ఈ హత్యలు చేస్తున్నట్లు స్పష్టంగా తేలింది.
గత నెల 29వ తేదీన తాండూర్ కు చెందిన సర్వబి (42) అనే మహిళ కూలి పని కోసం వెళ్లి అదృశ్యమైంది. తన భార్య తిరిగి రాకపోవడంతో భర్త మహమూద్ ఒకటో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. శాంతి మహల్ ఎక్స్ రోడ్డు వద్ద కూలీల అడ్డ మీద సర్వబి అనే మహిళ తో ఒక వ్యక్తి మాట్లాడి ఆమెను ఇందిరా చౌక్ వైపు తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. ఆ వ్యక్తి వివరాలు సేకరించగా ధరూర్ మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టప్పగా గుర్తించారు. నిందితుడు కిష్టప్ప అదుపులోకి తీసుకొని విచారణ చేయగా నేరాన్ని అంగీకరించాడు. సర్వబి మహిళకు కూలి పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమెను పెద్దముల్ మండలంలోని తట్టేపల్లి అడవిలోకి తీసుకువెళ్లినట్లు ఒప్పుకున్నాడు. ఆమె చీర కొంగు మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం పోలీసులు అడవిలో ఉన్న మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు నిందితుడి వద్ద నుండి కాళ్ళ పట్టీలు, వెయ్యి రూపాయలు, ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సైకో కిల్లర్ గతంలో కూడా కూలి పని చేసుకుంటున్న మహిళలనే టార్గెట్ చేసుకొని హత్యలు చేశాడని నిర్ధారణ అయింది. ఇప్పటికే నిందితుడుపై వికారాబాద్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు యాలాల పోలీస్ స్టేషన్లో ఒక కేసు దారూరు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు తాండూరు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు మొత్తం కలిపి ఆరు కేసులు నమోదై ఉన్నాయి. మొత్తం ఏడుగురిని ఈ సైకో కిల్లర్ హత్య చేశాడని పోలీసులు భావిస్తూ ఉన్నారు.