నార్సింగి డబుల్ మర్డర్స్ కేసులో పురోగతి.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్ట్

సంక్రాంతి పండుగ రోజు హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసిన నార్సింగి జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

By Knakam Karthik  Published on  16 Jan 2025 4:40 PM IST
HYDERABAD, CRIME NEWS, HYDERABAD POLICE

నార్సింగి డబుల్ మర్డర్స్ కేసులో పురోగతి.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్ట్

సంక్రాంతి పండుగ రోజు హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసిన నార్సింగి జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వివాహేతర సంబంధమే జంట హత్యలకు కారణమని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. అయితే ఇద్దరిని హత్య చేసిన అనంతరం నిందితుడు మధ్యప్రదేశ్‌కు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు, మొత్తానికి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంక్రాంతి పండ వేళ హైదరాబాద్‌ నార్సింగి పరిధిలోని పుప్పాల్‌గూడ అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద జంట హత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. జనవరి 14న ఉదయం స్థానికులు కొందరు గుట్టపై నుంచి గాలిపటాలు ఎగరేస్తుండగా.. ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి షాక్‌కు గురైయ్యారు. భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో క్లూస్‌ కోసం కొద్ది దూరం వెళ్లగా.. అక్కడ మరో మహిళ డెడ్‌బాడీ కూడా కనిపించింది. తలపై బండరాయితో మోది ఇద్దరిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. క్రైమ్ స్పాట్‌లో వారి ఒంటిపై కత్తిపోట్లు, ముఖంపై రాయితో కొట్టిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. మృతులను మధ్యప్రదేశ్‌ రాష్టానికి చెందిన అంకిత్‌ , ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన బిందుగా గుర్తించారు. అంకిత్ నానక్‌రామమ్‌గూడలో నివాసం ఉంటూ హౌజ్ కీపర్‌గా పని చేస్తున్నాడు. బిందు వనస్థలిపురంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.

ఈ డబుల్ మర్డర్ కేసులో ఊహించని విషయాలు బయటికి వచ్చాయి. ముగ్గురు పిల్లల తల్లి అయిన మృతురాలు, ఒకే టైమ్‌లో ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే బిందుకు అప్పటికే ఓ వ్యక్తితో వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత అంకిత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవటమే కాకుండా అదే సమయంలో మరో యువకుడితోనూ బిందు లవ్ ట్రాక్ నడిపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చనిపోయిన మహిళ అంకిత్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడాన్ని నిందితుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో దాడి చేసి హత్య చేశాడు. అంతేకాకుండా ముఖాలు గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హత్యల తర్వాత నిందితుడు మధ్యప్రదేశ్‌కు పారిపోయాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో డబుల్ మర్డర్స్ మిస్టరీ వీడింది.

Next Story