అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని శ్రీ గంప మల్లయ్య స్వామి కొండమీద అపశృతి చోటు చేసుకుంది. పూజా సమయంలో పూజారి అప్పా పాపయ్య కాలు జారి లోయలో పడిపోయాడు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు. ఎత్తు ఎక్కువగా ఉన్న కొండ మీద నుంచి పడిపోవడంతో పూజారి పాపయ్య మృతి చెందారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలావుంటే.. శింగనమల మండలం పరిధిలోని శ్రీ గంప మల్లయ్య స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ పూజా కార్యక్రమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతి శనివారం భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళుతుంటారు. కొండపైకి పాదయాత్రగా వెళుతుంటారు భక్తులు. ఇక కొండపై స్వామివారికి హారతి ఇచ్చే కార్యక్రమం ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటుంది. ఎత్తైన కొండ పై నూనె చారలు ఉన్న బండ పై నుంచి పూజారి పూనకం వచ్చిన విధంగా హారతి ఇస్తారు. దీనిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. గోవిందనామ స్మరణలో ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంటుంది. పూజారి మరణంతో ఈసారి విషాదం మిగిలింది.