లిప్ట్‌లో రెండు నిమిషాలు ఇరుక్కుపోయిన కొడుకు.. గుండెపోటుతో కన్నుమూసిన తండ్రి
రెండే రెండు నిమిషాలు.. తన కొడుకు లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడన్న టెన్షన్ ఆ తండ్రిని ఎంతో భయపెట్టింది.
By Medi Samrat
రెండే రెండు నిమిషాలు.. తన కొడుకు లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడన్న టెన్షన్ ఆ తండ్రిని ఎంతో భయపెట్టింది. ఆ భయంతో హార్ట్ అటాక్ కూడా వచ్చింది. కుప్పకూలిపోయి క్షణాల్లో మరణించాడు. రెండు నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది, లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. అందులో నుండి అతడి కొడుకు బయటకు వచ్చాడు.. ఒంటి మీద ఎలాంటి గీత కూడా లేకుండా!!
తన కొడుకు లిఫ్ట్ లో ఇరుక్కుపోవడంతో ఒక వ్యక్తి తన కొడుకు భద్రతపై భయాందోళనకు గురయ్యాడు. ఆ వ్యక్తి గుండెపోటుకు గురై మరణించాడు. రెండు నిమిషాల్లోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించగా అతడి కొడుకు సురక్షితంగా ఉన్నాడు. భోపాల్ లోని నిరుపమ్ సొసైటీ అపార్ట్‌మెంట్ భవనంలో ఈ విషాదం జరిగింది,
51 ఏళ్ల రిషిరాజ్ భట్నాగర్ తన భార్య, ఇద్దరు కుమారులతో నివసిస్తున్నాడు. మే 26, సోమవారం రాత్రి రిషిరాజ్ కిందికి దిగి వచ్చి తన 8 ఏళ్ల కొడుకును అక్కడ చూశాడు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఆ పిల్లవాడిని కుటుంబం నివసించే మూడవ అంతస్తుకు లిఫ్ట్ లో రమ్మని అడిగాడు. కొద్దిసేపటికే విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో బాలుడు లోపల ఇరుక్కుపోయాడు, దీనితో రిషిరాజ్ తీవ్ర ఆందోళన చెందాడు ఇంతలో అతనికి గుండెపోటు వచ్చింది. రెండు నిమిషాల్లోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది. రిషిరాజ్ కుమారుడు సురక్షితంగా బయటకు వచ్చాడు.
అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నివాసితులు రిషిరాజ్‌ను ఆసుపత్రికి తరలించగా అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పిల్లాడు పూర్తిగా క్షేమంగా ఉన్నాడని, ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని పోలీసులు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చిందని తేలింది.