పోలీసు అధికారి భార్య, కుమార్తెను దారుణంగా హతమార్చిన కరుడుగట్టిన క్రిమినల్
ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 14 Oct 2024 6:31 PM ISTఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ తాలిబ్ షేక్ భార్య మెహనాజ్ (35), అతని కుమార్తె ఆలియా (11)లను ఆదివారం అర్థరాత్రి మహ్‌గవాన్‌లోని వారి అద్దె ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి పదునైన ఆయుధంతో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో మహిళ, ఆమె కుమార్తె మాత్రమే ఉన్నారు. ఘటనా స్థలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పీడ గ్రామంలోని రోడ్డు పక్కన ఉన్న గొయ్యిలో హంతకులు ఇద్దరి మృతదేహాలను విసిరి అక్కడి నుంచి పరారయ్యారు.
అర్థరాత్రి డ్యూటీ ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి మొదటి అంతస్తులోని ఇంటి తలుపు తెరిచి ఉంది. తాలిబ్ భార్య, కూతురు అక్కడ లేరు. ఇంటి నిండా రక్తపు జాడలు కనిపించాయి. ఈ ఘటనలో సూరజ్‌పూర్‌కు చెందిన కరుడుగట్టిన క్రిమినల్, స్క్రాప్ డీలర్ కుల్‌దీప్ సాహును పోలీసులు ప్రధాన నిందితుడిగా పరిగణించి అతడి కోసం గాలిస్తున్నారు. అందిన సమాచారం మేరకు ప్రధాన నిందితుడు కుల్దీప్ సాహు ఆదివారం పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత ఓ కానిస్టేబుల్‌పై వేడి నూనె పోశాడు. దీంతో అతడి కోసం పోలీసు బృందం వెతుకులాటకు దిగింది. హెడ్ కానిస్టేబుల్ తాలిబ్ షేక్ కూడా అతని కోసం వెతికారు. ఆ సమయంలో ఇంట్లో తాలిబ్ లేకపోవడంతో నేరస్థులు ఇంటి దగ్గరకు వచ్చి దారుణానికి తెగబడ్డారు. ఘటన అనంతరం మృతదేహాన్ని తరలించిన కారును పోలీసులు సీజ్ చేశారు. కారులో చాలా చోట్ల రక్తపు ఆనవాళ్లు కనిపించాయి.
సూరజ్‌పూర్‌లో జంట హత్యల తర్వాత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కోపోద్రిక్తులైన ప్రజలు ప్రధాన నిందితుడు కుల్దీప్ సాహు ఇంటిని ధ్వంసం చేసి.. స్క్రాప్ గోదాముకు నిప్పంటించారు. పోలీసు స్టేషన్ వెలుపల నిరసన ప్రారంభించారు. నగరంలో దుకాణాలు మూసి నిరసన తెలిపారు. ఈ విషయమై సూరజ్‌పూర్ ఎస్‌ఎస్పీ ఎంఆర్ అహిరే మాట్లాడుతూ.. ప్రధాన అనుమానితుడు కుల్దీప్ సాహును అరెస్టు చేసేందుకు పలు బృందాలను నియమించామని చెప్పారు. అతని వాహనాలు కొన్ని జప్తు చేశామని.. త్వరలోనే నిందితులను కూడా పట్టుకుంటామన్నారు.