నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ముంబై నగరంలోని ఓ డ్రైనేజీ కాలువలో వదిలి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాలువలో వదిలి వెళ్లిన శిశువును ముంబై నిర్భయ పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. శిశువును గుడ్డలో చుట్టి గుర్తు తెలియని వ్యక్తులు డ్రైనేజీ కాలువలో వదిలి వెళ్లారు. కాలువలో పసికందును గమనించిన పిల్లులు.. వెంటనే మ్యావ్ మ్యావ్ అంటూ అరుస్తూ అల్లకల్లోలం రేపాయి. దీంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే పంత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు.
నగరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ముంబై నిర్భయ స్క్వాడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైనేజీ కాలువలో ఉన్న శిశువును గుర్తించి.. వెంటనే ఆ శిశువును రాజవాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పిల్లులు అప్రమత్తం చేయడంతో డ్రైనేజీ కాలువలో పడి ఉన్న శిశువును కాపాడామని ముంబై పోలీసులు తెలిపారు. శిశువు తల్లిదండ్రుల వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పిల్లులు అల్లకల్లోలం చేయడంతోనే శిశువును స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.