హైదరాబాద్ : యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కీలక నిందితులు ఎ. నమ్రత, ఆమె సహచరులు ధనశ్రీ సంతోషి, కళ్యాణిలను పోలీసులు విచారించారు. నిందితులని ప్రశ్నించడం ద్వారా లభించిన ఆధారాల ఆధారంగా పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతను వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి అద్దె గర్భం కోసం మహిళలను ప్రలోభపెట్టాడని పోలీసులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే హైదరాబాద్‌కు వచ్చే దంపతుల నుంచి ఫీజులు వసూలు చేయడం, వారిని సరోగసీ టెస్టుల కోసం విశాఖపట్నం పంపడంలో కీలకంగా వ్యవహరించేవాడు.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు దర్యాప్తులో భాగంగా విజయవాడ, విశాఖపట్నంలను సందర్శించే అవకాశం ఉందని, వారు సేకరించిన ఆధారాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నమ్రత కారణంగా మోసపోయిన బాధితులపై కూడా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. కర్ణాటక, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లో నర్మత బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని ఐవీఎఫ్ చికిత్స , సరోగసీ రాకెట్ నడుపుతున్నట్టు దర్యాప్తు అధికారికి నివేదికలు అందాయని వర్గాలు తెలిపాయి. నమ్రత పిల్లలను అప్పగించే సమయంలో జంటలకు ఇవ్వడానికి నకిలీ జనన ధృవీకరణ పత్రాలను సృష్టించిందని అధికారులు కనుగొన్నట్లు వర్గాలు తెలిపాయి.