కృష్ణా జిల్లాలో తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్

Police arrests a gang for smuggling turtles in Krishna district. కృష్ణా జిల్లా కొల్లేరు ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on  28 Feb 2022 12:45 PM IST
కృష్ణా జిల్లాలో తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్

కృష్ణా జిల్లా కొల్లేరు ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి వడర్లపాడు గ్రామం వద్ద రూరల్ ఎస్ ఐ చల్లా కృష్ణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించగా ఆటో, మినీ వ్యాన్ లో 25 బస్తాల్లో నాలుగు టన్నుల తాబేళ్లు లభ్యమయ్యాయి. కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన పంతగాని నాగభూషణం (48), గరికిముక్కు సందీప్ (30), దేవదాసు ఏసుబాబు (27) తాబేళ్లను తరలిస్తుండగా పోలీసులు ఆదివారం వారి వాహనాలతో సహా పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

నిందితులు తాబేలును రూ.15కు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో రూ. 50 నుంచి రూ.100లకు అమ్ముతున్నారని తెలిసింది. ఈ తాబేళ్ల మాంసానికి డిమాండ్ బాగా పెరిగింది. వైల్డ్ లైఫ్ ఏలూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి కుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ రేంజ్ అధికారి జయ ప్రకాష్, బీట్ ఆఫీసర్ రాజేష్ లు నిందితులపై అటవీ పర్యావరణ చట్టం 1972 సెక్షన్ 1972 కింద కేసు నమోదు చేసి కైకలూరు కోర్టుకు తరలించారు. పట్టుకున్న తాబేళ్లను మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కొల్లేరు సరస్సులో వదులుతామని అధికారులు తెలిపారు.

Next Story