సాధారణంగా బర్త్ డే ఫంక్షన్స్ అంటే కాస్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ కాస్తా పోలీసు స్టేషన్ కు దారి తీస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్నేహితుని పుట్టినరోజు వేడుకల్లో నలుగురు ఫ్రెండ్స్ కలిసి సరదాగా బొమ్మాబొరుసు ఆడుతున్నారు. దీంతో మిగతా వారిని ఆకర్షించింది. గెలుపోటములతో సంబంధం లేకుండా పందెం కడుతూ మజా చేస్తున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి అందరినీ అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
చింతల్‌లోని ఐడీపీఎల్‌లో ఉన్న ఎంపీఆర్ కన్వెన్షన్‌హాల్‌లో శ్రీనాథ్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు ఇలా పోలీసుల దగ్గరకు వెళ్లేలా చేసింది. శ్రీనాథ్ బర్త్ డే పార్టీకి అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. గోపాల్, శ్రీనాథ్, సంతోష్, శ్రీనివాసులు అనే వ్యక్తులు సరదాగా రూ.1 నాణెం ఉపయోగించి బొమ్మాబొరుసు ఆడటం మొదలు పెట్టారు. వీరికి మరో 38 మంది తోడయ్యారు. బెట్టింగ్‌తో ఆట భారీగా నడుస్తోందనే విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో జీడిమెట్ల పోలీసులు రంగంలోకి దిగారు. బెట్టింగ్ ఆడుతున్న 42 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.4.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.