ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బలోదబజార్-భటపరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును పికప్ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు.
ఖిలోరా గ్రామానికి చెందిన బాధితులు అర్జుని ప్రాంతంలో జరిగిన ఓ వివాహా వేడుకకు వెళ్లారు. విందు పూర్తైన అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా బలోడా బజార్ జిల్లాలోని భాటపరా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఖమారియా ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఓకే గ్రామానికి చెందిన 11 మంది మరణించడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.