ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై సైని వైపు వెళ్తున్న పికప్ ట్రక్కు అదుపు తప్పి దోర్మా పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మినీ లారీని వెనుక నుండి ఢీకొట్టింది.
By - Medi Samrat |
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై సైని వైపు వెళ్తున్న పికప్ ట్రక్కు అదుపు తప్పి దోర్మా పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మినీ లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ పికప్ ట్రక్కు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో ఆ వాహనంలో మహిళలు, పిల్లలతో సహా 25 మంది ఉన్నారు. పలువురికి తీవ్రగాయాలవగా.. చికిత్స కోసం తరలిస్తుండగా ఎనిమిది మంది మరణించారు.
వాహనంలో ఉన్నవారంతా ఫతేపూర్ జిల్లాలోని మాల్వా ప్రాంతంలోని బరోఖర్ గ్రామ నివాసులని సమాచారం. వారు రామనవమి సందర్భంగా శుక్రవారం ఉదయం కడా ధామ్‌లోని శీతలా మాతను దర్శించుకోవడానికి ట్రక్కును బుక్ చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిని తరలించడానికి ఆరోగ్య శాఖ నాలుగు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది. అత్యవసర సిబ్బందితో పాటు, స్వయంగా సీఎంఓ కూడా ఆసుపత్రిలో ఉండి, గాయపడిన వారిని పరిశీలిస్తున్నారు. సీఎంఓ పర్యవేక్షణలో జిల్లా ఆసుపత్రిలో కూడా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
ఫతేపూర్ జిల్లాలోని జాఫర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరవల్ గ్రామానికి చెందిన పంకజ్ సింగ్, రామనవమి సందర్భంగా ఈరోజు తన కుమారుడికి గుండు చేయించారు. అతని కుటుంబం, బంధువులు మొత్తం 35 మంది వాహనంలో ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణించారు. శుక్రవారం మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో వారు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారి ఆర్తనాదాలతో రోడ్డంతా నిండిపోయింది. ఈ ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. మొత్తం 23 మంది రోగులు కేంద్రానికి వచ్చారని తెలిపారు. వీరిలో ఒక మహిళ, ముగ్గురు పిల్లలు మరణించినట్లు భావిస్తున్నారు. మిగిలిన ఐదుగురికి ఎముకలు విరిగాయని అనుమానించి, ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి పంపించారు. కొంతమంది పిల్లలతో సహా మరో 14 మంది రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు.