న్యూ బోయినపల్లికి చెందిన 40 ఏళ్ల గృహిణి తాను ప్రైవేట్‌గా ఉన్న క్షణాలను చిత్రీకరించడానికి, తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి తన భర్త తమ ఇంట్లో రహస్య స్పై కెమెరాలను అమర్చాడని ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళ వాంగ్మూలం ప్రకారం.. తన గదిలో స్పై కెమెరాలను అమర్చినట్లు ఆమె కనుగొంది. తన భర్త ఇటీవల తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తనకు చూపించాడని, భర్తపై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్లకపోతే వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది.
నవంబర్ 27వ తేదీ రాత్రి ఆ మహిళకు మరో గది నుంచి కొన్ని శబ్దాలు వినిపించినట్లు సమాచారం. అనుమానం వచ్చి కిటికీ తెరిచినప్పుడు, అవతలి గది నుండి ఎరుపు లైట్లు వస్తున్నట్లు ఆమె గమనించింది. ఇంట్లో సోదాలు చేయగా, ఆమెకు రహస్య స్పై కెమెరాలు కనిపించాయి. తాను స్నానం చేయడం, ఇతర ప్రైవేట్ క్షణాలకు సంబంధించిన స్పష్టమైన చిత్రాలను తన భర్త సేకరించాడని ఆమె వాపోయింది. బ్లాక్‌మెయిల్‌కు తన అత్తమామలు కూడా సహకరించారని ఆమె ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 78, ఐటీ చట్టంలోని సెక్షన్ 66-డి కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.