మళ్లీ ఆత్మహత్యకు యత్నించిన మాజీ మిస్ తెలంగాణ.. మూడు రోజుల వ్య‌వ‌ధిలో రెండుసార్లు

Once again Former Miss Telangana attempts suicide.మాజీ మిస్ తెలంగాణ హాసిని మ‌ళ్లీ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. మూడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Oct 2021 8:51 AM IST
మళ్లీ ఆత్మహత్యకు యత్నించిన మాజీ మిస్ తెలంగాణ.. మూడు రోజుల వ్య‌వ‌ధిలో రెండుసార్లు

మాజీ మిస్ తెలంగాణ హాసిని మ‌ళ్లీ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. మూడు రోజుల వ్య‌వ‌ధిలో రెండు సార్లు ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. బుధ‌వారం హైద‌రాబాద్‌లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి య‌త్నించిన ఆమె.. శుక్ర‌వారం కృష్ణా జిల్లా కంచిక‌చ‌ర్ల మండ‌లం కీస‌ర స‌మీపంలోని మునేటి వంతెన పై నుంచి నీటిలోకి దూకింది. గ‌మ‌నించిన స్థానికులు నీటిలోకి దిగి ఆమెను ర‌క్షించి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్‌ హాసిని(21) హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తూ మోడ‌లింగ్ చేస్తోంది. 2018లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వ‌హించిన పోటీల్లో 'మిస్ తెలంగాణ' గా ఎంపిక‌య్యారు. కాగా.. రెండు రోజుల క్రితం చున్నీతో ఫ్యాన్‌కు ఉరి బిగించుకొని తన తల్లిదండ్రులు, స్నేహితులకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కాల్ చేసింది. 'ఆత్మహత్య తప్పని తెలుసు. అమ్మా, నాన్న మన్నించండి' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కంగారుపడిన తల్లిదండ్రులు, స్నేహితులు ఫోన్‌లు చేస్తున్నా పట్టించుకోకుండా ఆమె తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతూనే ఉంది.

'నాకు ఎవరూ అవసరం లేదు, ఒకసారి యాసిడ్‌ దాడి యత్నాన్ని, మరోసారి వేధింపుల్ని.. ఆపై ఎంతోమంది నుంచి రకరకాల వ్యాఖ్యలను ఎదుర్కొన్నా.. అందరికీ గుడ్‌ బై ఫర్‌ ఎవర్‌'' అని చెబుతూ.. కాళ్లకింద ఉన్న స్టూల్‌ను త‌న్నేసింది. ఇదంతా చూస్తున్న‌ జ‌గిత్యాల‌కు చెందిన ఓ స్నేహితుడు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు. పోలీస‌లు ఆగ‌మేఘాల మీద ఆమె ఉంటున్న గ‌ది వ‌ద్ద‌కు చేరుకుని త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి లోప‌లికి వెళ్లారు. అదృష్ట‌వ‌శాత్తు మెడ‌కు బిగించుకున్న చున్నీ ముడి విడిపోవ‌డంతో ఆమె మంచంపై ప‌డి పోయి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌గా.. పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గురువారం ఆమె కుటుంబ స‌భ్యులు వ‌చ్చి కృష్ణా జిల్లాలోని త‌మ స్వ‌గ్రామానికి తీసుకువెళ్లారు. అయితే.. శుక్ర‌వారం నందిగామ స‌మీపంలోని కీస‌ర వ‌ద్ద మున్నేరు బ్రిడ్జిపై నుంచి దూకి మ‌రోసారి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. ఆర్థిక ఇబ్బందులతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు హాసిని మొన్న పోలీసులకు తెలిపింది.

Next Story