ఒడిశాలోని కటక్ లో దారుణ ఘటన జరిగింది. అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించలేదని ఒక యువకుడిని స్కూటర్‌కు కట్టేసి రద్దీగా ఉండే వీధుల్లో ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడిని నగరంలోని షెల్టర్ చక్ నుండి మిషన్ రోడ్ వరకు స్కూటీ వెనుక కట్టి ఈడ్చుకెళ్లారు. దీంతో కటక్ పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కటక్ డీసీపీ పినాక్ మిశ్రా మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన గురించి పోలీసులకు తెలిసిందన్నారు. "ఇది చాలా సున్నితమైన కేసు కాబట్టి, వెంటనే నేను అన్ని పోలీసు స్టేషన్‌లు, ఏసీపీలను దర్యాప్తు చేయాలని కోరాను. ఈరోజు ఇద్దరు నిందితులు, బాధితురాడిని గుర్తించాం. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రాథమిక విచారణలో.. బాధితుడికి నిందితుల గురించి తెలుసు.. వారి నుండి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించకపోవడంతో.. నిందితులు అతడిని స్కూటర్‌పై కట్టేసి కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు సమాచారం.
అయితే.. నిందితుల నేర నేపథ్యంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ తెలిపారు. ఒడిశాలో ఇలాంటి ఘటన ఇదే మొదటిది కాదు. గతంలో.. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో మొబైల్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణలతో ఒక వ్యక్తికి షూ దండ వేసి ట్రక్కు ముందు భాగంలో కట్టి శిక్షించిన ఘటన చోటుచేసుకుంది.