పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని డబుర్జి ప్రాంతంలోని ఇటీవల అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి దుండగులు శనివారం నాడు కాల్పులు జరిపారు. ఇద్దరు సాయుధ వ్యక్తులు సుఖ్‌చైన్ సింగ్ నివాసంలోకి ప్రవేశించి, అతని భార్య, బిడ్డ విడిచిపెట్టాలని వేడుకుంటున్నా కూడా కనికరం చూపించకుండా సమీపం నుండి అతనిపై కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్ గాయాలైన సింగ్‌ను ఆసుపత్రిలో చేర్చారు. దాడి దృశ్యాలు సుఖ్‌చైన్ సింగ్ ఇంటి లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వారి పిస్టల్స్ జామ్ కావడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
సుఖ్‌చైన్ సింగ్ అమెరికాలో నివసిస్తున్నారు. 20 రోజుల క్రితం అమృత్‌సర్‌కు తిరిగి వచ్చారు. ఇటీవల రూ.1.5 కోట్ల విలువైన విలాసవంతమైన కారును కొనుగోలు చేశాడు. సాయుధ దుండగులు సింగ్ కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గురించి ఆరా తీస్తున్నామనే నెపంతో అతని ఇంటికి ప్రవేశించి, ఆపై అతనిపై కాల్పులు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక సింగ్ మొదటి భార్య కుటుంబ హస్తం ఉందని అతని తల్లి ఆరోపించింది. ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అమృత్‌సర్ పోలీస్ కమిషనర్‌ను కోరింది.