మైనర్ బాలికలను కిడ్నాప్ చేయడం.. ఆ తర్వాత..
Noida Police busts Haryana gang that sold minor girls to older men. మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు
By Medi Samrat Published on 10 Jan 2022 7:14 PM IST
మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ముఠా సభ్యులు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి హర్యానాలోని వివిధ జిల్లాల్లో విక్రయిస్తున్నారు. ముఠాలోని ముగ్గురు మహిళలతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులందరూ పక్కా ప్లాన్ చేసి మైనర్ బాలికలను కిడ్నాప్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. గ్రేటర్ నోయిడాలోని ఛప్రౌలాలో రెండు వారాల క్రితం ఓ మైనర్ బాలిక అదృశ్యమైంది. బాదల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసు బృందం బాలిక కోసం వెతకడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత, కిడ్నాప్ అయిన అమ్మాయికి సోనిపట్‌లో పెళ్లి చేస్తున్నారనే ఆధారాలను కనుగొన్నారు. అనంతరం పోలీసులు బాలిక వద్దకు చేరుకున్నారు. దీంతో ముఠాకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ కేసు మైనర్ బాలికల అక్రమ రవాణాకు సంబంధించినదని ఎస్‌ఓ బాదల్‌పూర్ దినేష్ సింగ్ తెలిపారు.
12 ఏళ్ల బాలిక తప్పిపోయిన కేసును రబుపురా పోలీసు బృందం దర్యాప్తు చేస్తుండగా ముఠా ప్రమేయం బయటపడిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మహిళలు మరియు పిల్లల భద్రత) వృందా శుక్లా తెలిపారు. మైనర్ డిసెంబర్ 26న కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబసభ్యులు రబుపురా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తమ ఇంటి బయట ఆడుకుంటూ 12 ఏళ్ల చిన్నారి అదృశ్యమైనట్లు బాలిక తల్లి తెలిపారు. పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభించారు. అదృశ్యమైన బాలిక హర్యానాకు చెందినది. ఆమెకు జస్వీర్ అనే 52 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారని.. ఆమెను రూ.70వేలకు కొనుగోలు చేశాడని తేలింది. మహిళా సభ్యులు యువతులను తమతో పాటు రమ్మని పిలుస్తారని, ఆ తర్వాత వారిని కిడ్నాప్ చేసి పెళ్లి కోసం కొందరికి అమ్ముతారని విచారణలో తేలింది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల ప్రకారం, ముఠా కార్యకలాపాల ముఖ్య స్థావరం హర్యానాలోని రోహ్‌తక్‌లో ఉంది. నోయిడా, గ్రేటర్ నోయిడా నుండి కూడా అమ్మాయిలను అపహరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు జస్వీర్‌తో సహా ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులను అరెస్టు చేశారు. మరో ఐదుగురు నిందితులను గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.