ప్రేమించిన యువతి వేరొకరిని వివాహం చేసుకుంటోందన్న బాధతో లండన్ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా దొంచంద గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఏరుగట్ల గ్రామానికి చెందిన అఖిల, శ్రీకాంత్ రెడ్డి గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై ఇరు కుటుంబాలతో మాట్లాడి, వివాహం చేసుకోవడానికి శ్రీకాంత్ రెడ్డి లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు.
ఇంతలో అఖిలకు వేరొక వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని తెలుసుకున్నాడు. మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీకాంత్ రెడ్డి మరణించాడు. అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఏరుగట్ల గ్రామంలో మృతదేహాన్ని పోలీసు వాహనంపై ఉంచి నిరసన తెలిపారు.