ప్రేమ పెళ్లి.. మరుసటి రోజే వధూవరుల మరణం.. కామారెడ్డిలో తీవ్ర విషాదం
Newly Married Couple Dead In Road Accident. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. కలిసి బతకాలనుకున్నారు.
By Medi Samrat Published on 12 Dec 2020 10:43 AM IST
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. కలిసి బతకాలనుకున్నారు.. పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.. ఆ సంతోషం నుంచి బయటికి వచ్చేలోపే విధి వారిని బలి తీసుకుంది. పెళ్లి బట్టలతో తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుందామనుకున్న ఆ జంటకు ఆయుష్షు ముగిసిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడెగాం గ్రామానికి చెందిన బట్టు సతీశ్ (24), హైదరాబాద్‌లోని గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన మహిమ (22) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. అతనికి మహిమతో పరిచయమైంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహ బంధంతో ఒక్కట్వాలనుకున్నారు. ఆ విషయం ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకోరని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
అమ్మానాన్నల దగ్గరకొస్తూ..
ప్రేమ పెళ్లి చేసుకున్న విషయాన్ని తమ తల్లిదండ్రులకు నేరుగా చెప్పాలని సతీశ్ జంటగా తమ స్వగ్రామమైన మోడెగాం గ్రామానికి బైక్‌పై బయల్దేరాడు. సదాశివనగర్‌లోని 44వ జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్‌కు సమీపంలో జాతీయ రహదారి దాటుతుండగా నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ దంపతులు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
అయితే సతీశ్ స్వగ్రామానికి వెళ్లే ముందు పోలీసుల సాయం కోరదామని భావించినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి దాటి పోలీస్ స్టేషన్‌కు వెళ్దామనుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. ఈ ప్రమాదం పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే జరగడంతో వెంటనే స్పందించిన పోలీసులు రక్తపు మడుగుల్లో పడి ఉన్న సతీశ్ ను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు, మహిమను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.