కోటాలో విద్యార్థిని సూసైడ్.. ఈ ఏడాది 11వ ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన 18 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని కోటాలో బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థి సూసైడ్.. ఈ ఏడాది 11వ ఆత్మహత్య
నీట్- యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు ప్రకటించిన ఒక రోజు తర్వాత, మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన 18 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని కోటాలో బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఏడాది కోటాలో ఈ విద్యార్థి ఆత్మహత్యతో మొత్తం 11 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. గత సంవత్సరం, నగరంలో 26 విద్యార్థి ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. కోటాలోని జవహర్ నగర్ ప్రాంతంలో తన తల్లి, సోదరుడితో కలిసి ఉంటున్న బగీషా తివారీ అనే బాధితురాలు భవనంపై నుంచి దూకింది. ఆమెను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, గంట తర్వాత ఆమె మృతి చెందిందని వారు తెలిపారు. ఆమె మృతదేహాన్ని మహారావ్ భీమ్ సింగ్ (MBS) ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఆమె తండ్రి కోటకు వచ్చిన తర్వాత పోలీసులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే పోలీసులు మాత్రం తమ విచారణను కొనసాగిస్తున్నారు. బాధితురాలు కోటాలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ) పరీక్షకు సిద్ధమవుతోంది. కాగా 12వ తరగతి చదువుతున్న బాధితురాలి సోదరుడు కూడా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ)కి సిద్ధమవుతున్నాడని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హరినారాయణ శర్మ గురువారం ఉదయం పీటీఐకి తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రకటించింది.