వివాహితను అందరి ముందే హతమార్చి.. మృతదేహాన్ని కౌగిలించుకుని..
Murder In Jalore. లైంగిక కోరికలు తీర్చకపోతే దాడులు చేసే ఘటనలు ఎన్నో చూశాం.. విన్నాం..! కానీ
By Medi Samrat Published on 25 Oct 2021 11:29 AM GMTలైంగిక కోరికలు తీర్చకపోతే దాడులు చేసే ఘటనలు ఎన్నో చూశాం.. విన్నాం..! కానీ ఓ యువకుడు వివాహిత మహిళపై అత్యంత ఆటవికంగా ప్రవర్తించాడు. తన లైంగిక కోరిక తీర్చలేదని ఓ యువకుడు వివాహిత మహిళను హత్యచేశాడు. పారిపోకుండా ఆమె మృతదేహాన్ని కౌగిలించుకుని పడుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లాలో దారుణం జరిగింది. అహోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని థన్వారా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు.
థన్వారా ప్రాంతానికి చెందిన వివాహిత మహిళ శాంతిదేవి (32) స్థానికంగా తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉంటున్నది. ఆమె భర్త మహారాష్ట్రలో పనిచేస్తూ అప్పుడప్పుడు వచ్చి భార్యకు డబ్బులు ఇచ్చి వెళ్తుంటాడు. స్థానికంగా ఉండే గణేశరమ్ అనే యువకుడు శాంతిదేవి వెంట పట్టాడు. ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తన కోరిక తీర్చాలని వెంటపడుతూ ఉండగా.. ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చింది. గణేశరమ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనికి వెళ్లిన శాంతిదేవిని అందరి ముందే కత్తితో నరికిచంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కౌగిలించుకుని పడుకున్నాడు. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి నుంచి శాంతిదేవి మృతదేహాన్ని విడిపించారు. పోస్టు మార్టానికి తరలించారు. నిందితుడు గణేశరమ్‌ను అరెస్ట్ చేశారు. శాంతిదేవి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. 'నేను నిన్ను వదిలిపెట్టను' అంటూ అతడు శాంతిదేవిపై దాడికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.