రైలు కిందప‌డి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చర్లపల్లి-ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, ఆమె ఇద్దరు పిల్లలు శనివారం రైలు కింద ప‌డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

By -  Medi Samrat
Published on : 31 Jan 2026 5:12 PM IST

రైలు కిందప‌డి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చర్లపల్లి-ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, ఆమె ఇద్దరు పిల్లలు శనివారం రైలు కింద ప‌డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను బోడుప్పల్‌లోని హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి(35), ఆమె ఇద్దరు పిల్లలు చేతన (18), విశాల్‌రెడ్డి (17)గా పోలీసులు గుర్తించారు. చేతన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, ఆమె తమ్ముడు విశాల్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులేమీ కనిపించడం లేదు. విజయశాంతి రెడ్డి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులోని ఓ సిరామిక్ కంపెనీలో పనిచేస్తున్నారని, ఘటన జరిగిన సమయంలో ఆయ‌న నెల్లూరులో ఉన్నట్లు సమాచారం.

రైల్వే పోలీసులు విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు చర్లపల్లి సెక్షన్‌లో కిలోమీటరు నంబర్ 206/48 వద్ద ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గూడ్స్ రైలు లోకో పైలట్ వాకీ-టాకీ ద్వారా అధికారులను అప్రమత్తం చేశారు. రైల్వే ట్రాక్‌పై రైలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు, ఒక మగ, ఇద్దరు ఆడవారు చనిపోయారని లోకో పైలట్ నివేదించారు. సమాచారం మేరకు ఐపీఎఫ్ చర్లపల్లి ఏఎస్ఐ (ఐపీఎఫ్) బి.ఎస్. రావు, జీఆర్‌పీ సిబ్బంది శ్రీ సాయి ఈశ్వర్ గౌడ్‌, ఎస్‌ఐ మాధవ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్ర గాయాలతో రైలు పట్టాల మధ్య పడి ఉన్న మృతదేహాలు బోడుప్పల్‌లోని హరితహారం కాలనీ వాసులుగా గుర్తించారు.

ప్రాథమిక నిర్ధారణ, లోకో పైలట్ వాంగ్మూలం ఆధారంగా.. పోలీసులు ఈ సంఘటనను ఆత్మహత్య కేసుగా అనుమానిస్తున్నారు. మృతుల‌ వద్ద ఎలాంటి రైలు టిక్కెట్లు కనుగొనలేదు. దీంతో వారు తమ జీవితాలను ముగించాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ట్రాక్‌లపైకి వచ్చి ఉండవచ్చని బావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 194 ప్రకారం క్రైమ్ నం. 57/2026 కింద కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై హరితహారం కాలనీ వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదికలు, సమగ్ర విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Next Story