ముత్తు చేసిన దారుణం.. కూతురు పెళ్లి కాదన్నందుకు..
బెంగళూరులోని బసవేశ్వర నగర్‌లో జరిగిన దారుణ ఘటన విషాదకరంగా ముగిసింది.
By - Medi Samrat |
బెంగళూరులోని బసవేశ్వర నగర్‌లో జరిగిన దారుణ ఘటన విషాదకరంగా ముగిసింది. తన కుమార్తె వివాహాన్ని వ్యతిరేకించినందుకు 42 ఏళ్ల మహిళకు నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఆమె చివరికి కాలిన గాయాలతో మరణించింది. డిసెంబర్ 23న జరిగిన ఈ సంఘటన నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధితురాలు దాదాపు మూడు వారాల పాటు ప్రాణాలతో పోరాడింది. దీనితో పోలీసులు హత్యాయత్నం కేసును హత్యగా మార్చారు.
బాధితురాలు గీత (42) విక్టోరియా ఆసుపత్రిలోచనిపోయింది. గీతా బసవేశ్వరనగర బోవికాలనీలో కిరాణా షాపును నడుపుతోంది. అక్కడే ప్రేమోన్మాది ముత్తు టీస్టాల్ పెట్టుకున్నాడు. గీత కుమార్తె (19)ను ముత్తు ప్రేమించాడు. ఆమెతో తనకు వివాహం చేయాలని గీతను కోరేవాడు, ఇందుకు ఆమె నిరాకరించేది. కోపోద్రిక్తుడైన ముత్తు గీత ఇంట్లో ఉండగా పెట్రోలు చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన గీత ఆస్పత్రిలో మరణించింది. స్థానిక పోలీసులు ముత్తును అరెస్ట్ చేశారు.
డిసెంబర్ 23 రాత్రి గీత, ముత్తు మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఘర్షణ తర్వాత గీత నిద్రపోయింది. నిందితుడు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఆమెకు సహాయం చేయడానికి వెంటనే విక్టోరియా ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె 50 శాతానికి పైగా కాలిన గాయాలతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరింది.