దారుణం: ప్రియుడితో కలిసి పదేళ్ల కొడుకును చంపి..శరీర భాగాలను సూట్‌కేస్‌లో దాచిన తల్లి

ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన పదేళ్ల కుమారుడిని.. అదే ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది

By Knakam Karthik
Published on : 12 May 2025 2:17 PM IST

Crime News, National News, Assam, Assam Police, Guwahati

దారుణం: ప్రియుడితో కలిసి పదేళ్ల కొడుకును చంపి..శరీర భాగాలను సూట్‌కేస్‌లో దాచిన తల్లి

అసోంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన పదేళ్ల కుమారుడిని.. అదే ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. గౌహతికి చెందిన దీపాలీ అనే మహిళ స్థానికంగా ఉండే ఓ క్లీనిక్‌లో పని చేస్తుంది. అయితే తన కుమారుడు తప్పిపోయాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ మహిళ రెండు నెలల క్రితమే తన భర్త బికాష్ బర్మాన్ నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు.

అయితే అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ప్యూన్‌గా పని చేసే జ్యోతిమోయ్ హలోయ్‌తో దీపాలికీ పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే పదేళ్ల కుమారుడైన మృణ్మోయ్ బర్మాన్‌ను చంపేందుకు కుట్ర పన్నారు. ఐదో తరగతి చదువుతున్న బాలుడిని దీపాలీ, జ్యోతిమోయ్ కలిసి అత్యంత కిరాతకంగా చంపినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్ కేస్‌లో దాచి పెట్టారని పోలీసులు వెల్లడించారు. కాగా నవోదయ జాతీయ విద్యాలయంలో చదువుతున్న బాలుడి మృతదేహాన్ని అటవీ శాఖ కార్యాలయం సమీపంలోని ఓ నిర్జన రహదారి వెంట గుర్తించారు. ఘటనా స్థలం నుంచి బాలుడి స్కూల్ బ్యాగ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story