ఎంత పని చేశావమ్మా.. పుట్టిన వాళ్లంతా చనిపోతున్నారని
Mother killed herself with twins in Hyderabad.వారిద్దరిది మేనరిక వివాహం. పెళ్లైన ఐదు సంవత్సరాలకు కవలలు
By తోట వంశీ కుమార్ Published on 21 Feb 2023 3:19 AM
వారిద్దరిది మేనరిక వివాహం. పెళ్లైన ఐదు సంవత్సరాలకు కవలలు జన్మించారు. అయితే పుట్టిన వారం వ్యవధిలోనే ఇద్దరూ చనిపోయారు. మరోసారి ఆమె గర్భం దాల్చింది. ఈ సారి కడుపులోనే శిశువు మరణించింది. మూడోసారి ఆమె గర్భం దాల్చింది. ఈ సారి ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఆ ఇంట ఆనందం వెళ్లి విరిసింది. అయితే.. వారిలో ఓ చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో ఆందోళన చెందిన ఆ తల్లి.. చిన్నారులకు ఏమవుతుందోననే మానసిక ఆందోళనకు గురైంది. చిన్నారులు ఇద్దరిని సంపులో పడేసి ఆ తరువాత తాను అదే సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నర్సింగ్‌రావు కారు డ్రైవర్‌గా పని పనిచేస్తున్నాడు. అతడికి సంధ్యారాణి(29)తో వివాహం జరిగింది. వీరిది మేనరికపు వివాహం. వీరు కానాజిగూడ పరిధిలోని శివనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి 2017లో కవలలు జన్మించారు. ఓ శిశువు అంగవైకల్యంతో మరొ చిన్నారికి గుండెలో రంధ్రంతో జన్మించారు. వారం వ్యవధిలోనే ఆ చిన్నారులు ఇద్దరూ మరణించారు.
సంధ్యారాణి 2018లో మరోసారి గర్భం దాల్చింది. ఈ సారి శిశువు కడుపులోనే మృతి చెందడంతో గర్భస్రావమైంది. దీంతో అప్పటి నుంచి సంధ్యారాణి మానసికంగా వేదనకు గురవుతోంది. మరోసారి గర్భం దాల్చిన ఆమె ఈ నెల 11న కవల(మగ, ఆడ) పిలల్లకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే ప్రసవం కావడం, బరువు తక్కువగా ఉండడంతో మగ శిశువును మూడు రోజులు ఐసీయూలో ఉంచారు.
ఈ నెల 14న తల్లీ బిడ్డలు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారు. అయితే..పాత జ్ఞాపకాలు ఆమెను వెంటాడాయి. అప్పటిలాగానే ఈ సారి కూడా పుట్టిన బిడ్డలు అనారోగ్యంతో చనిపోతారనే భయం ఆమెను వెంటాడింది. ఆదివారం అర్థరాత్రి సమయంలో భర్త నిద్రలో ఉండగా.. ఇంటి ముందు ఉన్న సంపులో బిడ్డలను పడేసింది. అనంతరం తాను ఆ సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఉదయం నిద్ర లేచిన నర్సింగ్‌రావుకు భార్య బిడ్డలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైయ్యాడు. అంతా వెదికాడు. ఇంటి ముందు సంపు తెరిచి ఉండటం చూసి.. అందులో చూడగా షాక్ తిన్నాడు. ప్రాణం లేని భార్య, చిన్నారులను చూసి రోదించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బిడ్డల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన, గతంలో జరిగిన ఘటనలే ఆత్మహత్యకు కారణం అంటూ రాసిందని చెప్పారు.