భర్త వేధింపులు భరించలేక.. ఐదుగురు కుమార్తెలతో బావిలో దూకిన తల్లి

Mother commits suicide with five daughters, jumps into well

By అంజి  Published on  6 Dec 2021 7:52 AM IST
భర్త వేధింపులు భరించలేక.. ఐదుగురు కుమార్తెలతో బావిలో దూకిన తల్లి

రాజస్థాన్‌లోని కోటాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ తల్లి తన ఐదుగురు కూతుళ్లతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటన కారణం ఇంటి గొడవలేనని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అందిన సమాచారం మేరకు మృతురాలు భర్తతో తరచూ గొడవపడుతుండేది. ఈ నేపథ్యంలోనే ఏదో విషయమై భర్తతో గొడవపడి ఐదుగురు కూతుళ్లతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో అందరూ చనిపోయారని చెచాట్ పోలీస్ స్టేషన్ తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెచాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కలియాఖేడీ గ్రామంలో శివలాల్‌ తన భార్య బాదం దేవి (40), ఏడుగురు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. అయితే మహిళ తన భర్తతో తరచూ రోజూ గొడవపడేది. ఈ క్రమంలోనే భార్య బాదం దేవి భర్త వేధింపులు భరించలేక విసిగిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లి.. ఐదుగురు కుమార్తెలతో కలిసి బయటకు వెళ్లింది. తల్లి సహా కూతుర్లు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి బాదం దేవితో పాటు సావిత్రి (14), అంజలి (8), కాజల్ (6), గుంజన్ (4), అర్చన (1) బావిలో శవాలుగా తేలారు. గ్రామస్తులు బావిలోని మృతదేహాలను బయటకు తీశారు. ఇప్పుడు ఆ కుటుంబంలో గాయత్రి (14), పూనమ్ (7) మాత్రమే సజీవంగా ఉన్నారు.

ఘటన జరిగిన సమయంలో కూతుళ్లిద్దరూ ఇంటి బయటే ఉన్నారని, అప్పుడే వారు ప్రాణాలతో బయటపడి ఉంటారని చెబుతున్నారు. లేకుంటే ఆ మహిళ వారిని తనతో తీసుకెళ్లి ఉండేది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలకు గురిచేసింది. భార్యాభర్తల మధ్య రోజూ గొడవలు జరిగేవని చర్చ జరుగుతోంది. పరస్పర విబేధాల కారణంగా ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అదే సమయంలో మృతురాలి భర్త శివలాల్‌ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపాడు. సాయంత్రం వరకు తిరిగి రాలేదు. రాత్రి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని రామ్‌గంజ్ మండి డిప్యూటీ ఎస్పీ ప్రవీణ్ నాయక్ అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. మొత్తం 6 మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాథమిక విచారణలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. కారణాలను ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఘటనపై స్పష్టత రానుంది. మృతురాలి భర్త, ఇరుగుపొరుగు వారి విచారణ కొనసాగుతోంది.

Next Story