ఖమ్మం గాంధీ చౌక్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లీ, ఇద్దరు కూతుర్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. నగరంలోని రాఘవ థియేటర్ ప్రాంతంలో నివసించే ప్రకాశ్ భార్య గోవిందమ్మ తన ఇద్దరు కూతుళ్లతో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలముకున్నాయి.
ప్రకాశ్, గోవిందమ్మలది నిరుపేద కుటుంబం. వీరి కుమార్తెకు కొద్దిరోజుల క్రితం వివాహం జరుప నిశ్చయం అయ్యింది. జనవరి 11న ముహూర్తం. ప్రకాశ్ బంగారు షాపులో పని చేస్తాడు. తల్లి కూతుళ్ళు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వివాహం దగ్గర పడటం, చేతిలో డబ్బులు లేవన్న భాదతో రాత్రి బంగారానికి మెరుగు పెట్టే రసాయనం తాగి తల్లి గోవిందమ్మ(49), రాధిక(29), రమ్య(28) ఆత్మహత్య చేసుకున్నారు.
పని నుండి ఇంటికి వచ్చిన ప్రకాశ్ తలుపులు ఎంత కొట్టినా ఇంట్లో వాళ్లు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలకొట్టి చూడగా తల్లికూతుళ్లు అప్పటికే మృతి చెందారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.